సాహిత్య,సినీ 'నట' రాజు... పుట్టిన రోజు

updated: February 13, 2018 14:29 IST
సాహిత్య,సినీ 'నట' రాజు... పుట్టిన రోజు

ఒక పాఠకుడి ప్రశ్న: నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది?

 జవాబు: మీ ముఖంలా ఉంటుంది! 

ఇలాంటి సమాధానం ఒక్కరు మాత్రమే ఇవ్వగలరు..ఆయనే  రావి కొండలరావు... 

రావి కొండలరావు..ఈ పేరు వినని తెలుగు వాడు ఉండడు...ఒక వేళ ఉండి ఉంటే వాడు జన్మరీత్యా ...తెలుగు వాడు అయ్యిండవచ్చేమో కానీ తెలుగు తెలుసిన వాడు మాత్రం కాడు ...ఇది కేవలం కొందరి అభిప్రాయం మాత్రమే కాదు చాలా సాహిత్యాభిమానులు, సిని అభిమానుల ఉమ్మడి నిశ్చిత అభిప్రాయం.  దాదాపు ప్రతీ తెలుగువాడు ఈ  రెండు వర్గాల్లో దేనికో ఒకదానికైనా అభిమాని అయ్యింటాడని అభిమానంగా చెప్పుకునే మాట. 

కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ఫలానా అని  గుర్తింపు ఇచ్చి మాట్లాడటం అనవసరం...కేవలం గుర్తు చేసుకోవటమే మనం చేసుకో తగ్గ పని. అందుకు ఓ కారణం కూడా ఉంది. అది ఆయన పుట్టిన రోజు వేడుక. ఆయన తన 87 న పుట్టిన రోజుని ఘనంగా...మనంగా (అంటే మన అనుకునే తన అభిమానల మధ్య) హైదరాబాద్ లో వికాసపరి పార్క్ కాలనీలో రీసెంట్ గా జరుపుకున్నారు. జరుపుకున్నారు అనేకంటే..అభిమానులు జరిపారు అంటే కరెక్టేమో. 

ఎటువంటి భేషజాలూ లేకుండా 87  ఏళ్ళు దాటిన వయసులో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో క్రియాశీలంగా ఉంటూ జీవిస్తున్న వ్యక్తి కావటంతో అభిమానులు చాలా మంది హాజరయ్యారు. నిరాడంబరంగా, కలుపుగోలుగా ప్రవర్తించే  ఆయన రచనలూ, నటనా అన్నీ చదువుకోవడానికీ, తిలకించ డానికీ హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటాయని సభాముఖంగా మరో సారి గుర్తు చేసుకున్నారు. 

1958లో ‘శోభ’ చిత్రంతో మొదలైన ఆయన సినీ నటనా ప్రస్దానం  60 ఏళ్ళు  పూర్తి చేసుకుని అలా ముందుకు వెళ్తూనే ఉంది.   మిగతా సినీమా వాళ్లలా  కాకుండా కొండలరావు గారు తన నాటక, సాహితీరంగాల కృషిని విడిచి పెట్టకపోవటమే ఆయన్ని మిగతా వారికన్నా ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆయన ఇలాగే మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని 'తెలుగు 100' మనస్పూర్తిగా కోరుకుంటోంది. 

ఇక పుట్టిన రోజు కార్యక్రమంలో పాల్గొన్నవారు

  రాళ్ళపల్లి,  వైజాగ్ ప్రసాద్,  ఆచారం షణ్ముఖాచారి, పురాణం వెంకట రమణ, కృష్ణవేణి, వోలేటి శ్రీనివాస భాను, కొల్లూరి భాస్కర రావు, డాll లలితవాణి, విజయదుర్గ, విజయ సారథి, అద్దేపల్లి శ్రీమన్నారాయణ, ఎమ్.వి.రావు, గుప్తా, బాలకృష్ణరావు, ఈనాడు సుధాకర్, పాలలోచన రావు  మొదలగువారు.

ఈ సందర్బంగా జరిగిన సంగీత విభావరి కార్యక్రమంలో ...అమర గాయకుడు ఘంటశాల గారి పాటలను టి.గోవిందరావు , వేటూరి రమాదేవి, సాగర్ ఆలపించారు. 


Tags: ravikodnalarao garu

comments